సింహాచలంలో లేదా చుట్టుప్రక్కల పరిసరప్రాంతాలలో ఒక ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయపరమైన మ్యూజియం కోసం స్థలం ఇవ్వండి.
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబునాయుడు గారికి విశాఖపట్నం బ్రహ్మకుమారీస్ ప్రతినిధి రామేశ్వరీ వినతి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను విజయవాడలో విశాఖ పట్నం బ్రహ్మకుమారిస్ మీడియా వింగ్ కోఆర్డినేటర్ బి. కె. రామేశ్వరి ఈ సెప్టెంబర్ 4వ తేదీ గురువారం నాడుకలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం లోని అన్ని సేవా కేంద్రాల వారి తరఫునుండి చేసుకొను విన్నపం ఏమనగా,
మన విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో లక్షలాదిమంది భక్తులకు సందర్శనార్ధం మేము ఒక ఆధ్యాత్మిక పరమైన మ్యూజియంను నిర్మించాలని సంకల్పించుకున్నాము అని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక మ్యూజియం నందు సనాతన ధర్మాన్ని అద్దం పట్టే విధముగా దేవతల విగ్రహాలతో పాటు, సామాజిక నైతిక విలువలు తెలియచేసే విధంగా అన్ని వయసుల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించుటకు సుందరమైన చిత్రాలను అమర్చాలనుకుంటున్నాము అన్నారు. ఇది కాకుండా చదువుకునే విద్యార్థులకు సైన్స్ పరమైన ఆధ్యాత్మికతను కలిపి జ్ఞాన విజ్ఞానమును బోధించుటకు మరిన్ని చిత్రాలను ఏర్పాటు చేయదలచుకున్నాము. భక్తులకు వైద్య సౌకర్యార్థం ఒక చిన్న చికిత్సాలయమును ప్రధమ చికిత్స కొరకు రెండు గదులతో ఏర్పాటు చేయదలుచుకున్నాము.
వీటి నిర్మాణం కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి సింహాచలం కొండ దిగువ ప్రాంతంలో భక్తులు మెట్లు ఎక్కే చోట ఒక వెయ్యి గజాలను మా సంస్థకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ఒకవేళ ఎండోమెంట్ భూమిలో ఏమాత్రం అవకాశం లేకపోయినట్లయితే ప్రక్కన ఉన్న ఏదైనా ప్రభుత్వ భూములలో 3 వేల గజాల స్థలాన్ని ఈ పుణ్యకార్యం కోసం కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సవినయంగా కోరుకుంటున్నాము అన్నారు. మాదకద్రవ్యాల సేవనము మత్తు పానీయాల సేవనంతో చదువుకునే విద్యార్థులు యువత నిర్వీర్యం అయిపోకుండా ఒక ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞాన మ్యూజియంలోని విషయాలను తెలియ పరచి నట్లయితే వారిలో ఆలోచన విధానం పరివర్తన అవుతుందని మా యొక్క మహా ఆశయం. ఈ విషయంలో మీరు తప్పక సహకరించగలరని మేము మరి మరి కోరుకుంటున్నాం. ప్రభుత్వం వారు దయచేసి 3 వేల గజాలలో ఆధ్యాత్మిక సంగ్రహాలయాన్ని నిర్మించడమే కాకుండా ఈ చికిత్సాలయాన్ని కూడా నిర్మించడానికి మాకు దిగువ సింహాచలం ప్రాంతంలో భక్తులకు అనుకూలంగా స్థలాన్ని కేటాయించగలరని ఆశిస్తున్నాము. శారీరక, మానసిక, సామాజిక ఆధ్యాత్మిక నిరంతర సేవలను మేము ప్రజానీకానికి ఉచితంగా అందివ్వగలమని సవినయముగా తెలియజేసుకుంటున్నాము అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్బములో ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపుల్ సెక్రటరీ గారికి వినతిపత్రాన్ని అందచేశారు. వారు ఈ మ్యూజియం విషయాన్నీ ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్తామని తెలియజేశారు.