పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం!

 


సోషల్ మీడియా నుంచి పిల్లలను రక్షించడానికి కొత్త చట్టం తెస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అధికారులతో సమావేశం.



ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక వికాసం దెబ్బతినకుండా సోషల్ మీడియాకు వారిని దూరంగా ఉంచాలనే యోచనలో ఉంది. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పిల్లల సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడం, వారికి సురక్షితమైన ఆన్ లైన్ వాతావరణాన్ని కల్పించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.



ఈ చట్టం రూపకల్పన, విధివిధానాల తయారీపై ఉండవల్లి నివాసంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులు, అధికారులతో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ&పీఆర్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ సైబర్ క్రైమ్ అదిరాజ్ సింగ్ రానా మరియు సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.



చట్టం రూపకల్పనపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు. పిల్లల ఆరోగ్యకరమైన వృద్ధికి, భవిష్యత్తుకు దోహదపడేలా ఈ చట్టం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.