మత సామరస్యంతోనే దేశాభివృద్ధి సాధ్యం
కల్లూరు సర్వమత సమ్మేళనంలో సూఫీ సాధువుల పిలుపు
- ఘనంగా హజరత్ సయ్యద్ మహమ్మద్ యుసుపుల్లా షా కమాల్బాషాఖాద్రి సమ్మేళనం
- తరలివచ్చిన హిందూ, ముస్లిం ఆధ్యాత్మిక గురువులు
హిందూపురం (కల్లూరు): భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలవాలన్నా, అఖండ భారత్‌గా సుస్థిరత సాధించాలన్నా అది కేవలం హిందూ-ముస్లింల ఐక్యతతోనే సాధ్యమని సూఫీ సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కల్లూరులోని హజరత్ సయ్యద్ మహమ్మద్ యుసుపుల్లా షా కమాల్బాషాఖాద్రి సద్గురువుల దివ్య సమాధి చెంత ఆధ్యాత్మిక గురువుల ఐక్యతా సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
మానవత్వమే అసలైన మతం:
దర్గా పీఠాధిపతి హజరత్ రఫీవుల్లా షా కమల్ పోషాఖాద్రి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈసారి కూడా కులమతాలకు అతీతంగా భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ మహేశ్వరానంద స్వామీజీ మాట్లాడుతూ.. దేశ పురోగతిలో రెండు కళ్లలాంటి హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని కోరారు. సమాజంలోని రుగ్మతలపై బూడిదగడ్డపల్లి అశ్వర్థ నారాయణ స్వామి, హృదయాల కల్మషాలను తొలగించడంపై పీఠాపురం ఆధ్యాత్మిక పీఠాధిపతి గౌ|| శ్రీ ఉమర్ అలీషా తమ ప్రసంగాలతో భక్తులను ఆలోచింపజేశారు. బీజాపూర్ నుంచి విచ్చేసిన రియాజ్ వుద్దీన్ షా రఫాయి రెండు మతాల సంప్రదాయాల మధ్య ఉన్న సారూప్యతను వివరించారు.
అఖండ భారత్‌కు ఐక్యతే పునాది:
అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ.. "హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయీ.. అందరూ భాయీ భాయీ" అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్మరించాలన్నారు. దేశ సుస్థిరతకు మత సామరస్యమే పునాది అని ఆయన స్పష్టం చేశారు.
తరలివచ్చిన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్ నాయుడు పాల్గొని సమాజ శాంతిలో మతం పోషించాల్సిన సానుకూల పాత్రను వివరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఖాన్, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు నంబూరి సతీష్, చేనేత కార్మిక నాయకులు ఏసీ నాగరాజు, దౌలా సాహెబ్, లేపాక్షి నరసింహులు, రామాంజి, ఎస్సీ కార్పొరేషన్ సభ్యురాలు నమ్మ తదితరులు పాల్గొన్నారు. సూఫీ సాధువుల శాంతి సందేశాలతో కల్లూరు ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.




