ధనాపురంలో సివిల్ సప్లై రైస్ గోడౌన్‌ను వెంటనే తరలించాలి: DSF డిమాండ్
ఆర్డీవో అరుణాదేవికి వినతిపత్రం అందజేత
ఆదోని: ధనాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సివిల్ సప్లై రైస్ గోడౌన్‌ను పాఠశాల, నివాస ప్రాంతాలకు దూరంగా అనువైన చోటికి తరలించాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆదోని ఆర్డీవో కే. అరుణాదేవిని కలిసి సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా DSF రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ వెంకటేష్ కిరణ్ మాట్లాడుతూ, గ్రామంలోని పాఠశాల, జనావాసాల మధ్య రైస్ గోడౌన్ ఏర్పాటు చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. గోడౌన్‌లో బియ్యం నిల్వ చేయడం వల్ల అందులోని పురుగులు, క్రిములు పక్కనే ఉన్న పాఠశాలలోకి చేరి విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం భారీ లారీల రాకపోకల వల్ల విపరీతమైన దుమ్ము, ధూళి లేచి పరిసరాల్లోని పంట పొలాలు దెబ్బతినడంతో పాటు విద్యార్థులు, రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు.
గతంలో ఊరి వెలుపల నాగనాతనహళ్లి రహదారిలో గోడౌన్ ఉండగా, ఇప్పుడు ఊరి మధ్యలోకి తీసుకురావడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజా శ్రేయస్సు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గోడౌన్‌ను తక్షణమే వేరే ప్రాంతానికి మార్చాలని కోరారు. అధికారులు స్పందించని పక్షంలో విద్యార్థులు, ప్రజలతో కలిసి గోడౌన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DSF సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


