రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 103వ వర్థంతి యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదిక స్థానిక జిల్లా కార్యాలయంలో సాహు మహరాజ్ 103వ వర్ధంతి సందర్భంగా మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మరియు పాలెం రాధ సాహు మహారాజ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ 1874 జూన్ 26 న రాధబాయి, జయసింగ్ ఆబా సాహెబ్ ఘాట్గే దంపతులకు సాహు మహరాజ్ జన్మించారు. సాహు మహరాజ్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు యశ్వంత్ రావ్,అతనికి యుక్త వయసు రాగానే 1894 ఏప్రిల్ 2 న కొల్హాపూర్ సింహాసనాన్ని అధిష్టించారు. సాహు మహరాజ్ దళిత, బహుజనులకు సామాజిక న్యాయ, ప్రజాస్వామిక తాత్విక పునాది ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహనీయుడు అని ఆమె అన్నారు.
రాజర్షి ఛత్రపతి సాహుమహరాజ్. పితృస్వామ్య ,కుల మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషంని గ్రహించిన సాహు మహరాజ్ మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించి సంగీతంలో చిత్రలేఖనంలో ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇప్పించారు. కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసి ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు ,ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసి కొల్హాపూర్ రాజారామ్ కాలేజీకి బాలికల ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి సాహు మహరాజ్ అని ఆమె తెలిపారు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించారు అంతేగాక సాహు మహారాజ్ అంటరానివారికి ఆపద్బాంధవుడు గా మారిన విషయం తెలుసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సాహుమహారాజ్ ల మధ్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటిష్ చట్టాలు మంచిచెడుల గురించి చర్చించేవారని ఆమె అన్నారు. అంబేద్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నానని అయితే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానని చెప్పడంతో ఆ పత్రికకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి మొదట 2,500 రూపాయలు ఇవ్వడంతో మూక్ నాయక్ పత్రిక ప్రారంభమైంది . 1920 ఏప్రిల్ 15న నాసిక్ లో అంబేద్కర్ మరియు అతని మిత్రులు అంటరానివారి కోసం ఒక హాస్టల్ కట్టాలి అనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదువేల రూపాయలను ఆర్థికంగా సాహు మహరాజ్ సహకరించారని ఆమె తెలిపారు. 1920 లో అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకొనుటకు సాహు మహరాజ్ ఆర్థిక సహాయం చేసారని ఆమె అన్నారు. అంబేద్కర్ విదేశాల్లో ఉన్నంతకాలం మూక్ నాయక్ పత్రిక కొనసాగేలా అందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయం సాహు మహరాజ్ చేశారని ఆమెతెలిపారు. అంబేడ్కర్ తిరిగి భారతదేశం రాగానే సాహు మహరాజ్ తన ఆస్థానం లోనే ఉద్యోగం ఇచ్చారని, అంతేకాకుండా1902 జూలై 26 వ తేదీన భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకంగా ప్రభుత్వము ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగాల అన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. రిజర్వేషన్లు మొట్టమొదటి సారిగా అమలుచేసి రిజర్వేషన్ల పితామహుడుగా చరిత్రలో నిలిచిన బహుజనుల ఆశాజ్యోతి సాహు మహరాజ్ అని ఆమె అన్నారు.అంటరానివారు మరియు అన్ని మతాలలో వెనుకబడిన వారు కూడా రిజర్వేషన్ల కిందకే వస్తారని సాహు అన్నారని ఆమె తెలిపారు. అంతేకాక తన ఆస్థానంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్యక్తి వెనుకబడిన వర్గాలలో ఒక్కరు కూడా లేకపోవడం చూసి సాహు మహారాజ్ వెనుకబడిన కులాల వారందరికీ స్కూల్స్ హాస్టల్స్ ప్రారంభించి విద్యను ఒక ఉద్యమంలా నడిపించారు. ఒక రాజు అయిన సాహుమహారాజ్ ఇంత నిబద్ధతతో సామాజిక ఉద్యమాలు నిర్వహించడం నిజంగా అరుదైన విషయం.కేవలం మహారాష్ట్రకే కాకుండా దక్షిణ భారతదేశంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహుమహరాజ్ 1922 మే 6న మరణించారాని అతని మరణాంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేత్తర పురోహితుల చేత జరిగాయని అంతటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఆమె అన్నారు.