విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడమే పరిష్కారం.



విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ పర్నేస్‌ `3ను తిరిగి 2025 జూన్‌ 27న ఉత్పత్తి ప్రారంభించడాన్ని అభినందిస్తున్నాం. కానీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలంటే విశాఖ స్టీల్‌కి క్యాప్టివ్‌ మైన్స్‌ కేంద్ర ప్రభుత్వం కేటాయించడమే సరైన పరిష్కారం.  కనీసం సెయిల్‌లోనైనా విలీనం చేయాలని కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం కావాలనే క్యాప్టివ్‌ మైన్స్‌ ఇవ్వకుండా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాల్లోకి నెడుతున్నది. ప్రతి సంవత్సరం సొంతగనులు లేనందువలన సుమారు 4వేల కోట్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.



డాబా గార్డెన్స్ వి.జె.యఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నర్సింగరావు, డి ఆదినారాయణ కో కన్వీనర్ రామచంద్ర రావు, వి శ్రీనివాసులు పాల్గొన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఉత్పత్తి విభాగాల ఆపరేషన్‌ మరియు మెయింటెనెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని రెండు ముఖ్య విభాగాలైన సింటర్‌ప్లాంట్‌ మరియు రామెటీరియల్‌ హాండ్లింగ్‌ ప్లాంట్‌ (ఆర్‌.ఎం.హెచ్‌.పి) విభాగాల ఆపరేషన్‌ మరియు మెయింటెనెన్స్‌ పనులు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆశక్తి గల కాంట్రాక్టర్లకు జూలై 12వ తేదీ నాటికి టెండర్లను ఆహ్వానించింది. ఈ విధంగా స్టీల్‌ప్లాంట్‌ను 13 విభాగాలుగా చేసి అన్ని విభాగాలను ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి పూనుకున్నది. ఇప్పుడు పని చేస్తున్న పర్మినెంట్‌ కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, ఆఫీసర్లకు ఉత్పత్తిలో ఎటువంటి భాగస్వామ్యం ఉండదు. క్రొత్తగా వచ్చే కాంట్రాక్టరు వారి మనుషులు మాత్రమే ఉంటారు. కాంట్రాక్టర్లు తమ లాభాలకోసమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నడిపిస్తారు. ఈ పద్దతిలో ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో తారాపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మార్కెటింగ్‌ విభాగం నడిపిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అండతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అడుగుపెట్టింది. ఈ కంపెనీ ఏ చట్టాలను అమలు చేయడం లేదు. ఈ విధంగా ఉత్పత్తి విభాగాలన్నింటిని కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ముఖద్వారం కూర్మన్నపాలెం వద్ద రిలే నిరాహారదీక్షలు 1583రోజులు సాగాయి. జూన్‌ 12 వ తేదీ రిలేనిరాహారదీక్ష శిభిరం వర్షానికి కూలిపోయింది. ఆనాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ అండతో పోలీస్‌ విభాగం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి ఈ శిభిరంలో ఎలాంటి నిరాహారదీక్షలు జరగకుండా అడ్డుకుంటున్నారు. మే 20నుంచి విశాఖ స్టీల్‌లో వేలాదిమంది కాంట్రాక్ట్‌ కార్మికులు జరిపిన నిరవధిక సమ్మెను దుర్మార్గంగా అణిచివేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆధునిక జైలుగా మార్చారు. పర్మినెంట్‌ ఎంప్లాయీస్‌ను లంచ్‌టైంలో కూడా సమ్మెకు మద్దతుగా మీటింగ్‌లు పెట్టనివ్వడం లేదు. రిలేనిరాహరదీక్ష శిభిరానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. విశాఖ స్టీల్‌లో 7గురు పర్మినెంట్‌ యూనియన్‌ నాయకులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. నలుగుర్ని సస్పెండ్‌ చేసారు. తీవ్రమైన నిర్భంద వాతావరణంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నడుస్తున్నది. విశాఖ స్టీల్‌లో ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడిరది. ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితోటే ఈ నిర్భంధం సాగుతోంది. విశాఖలోని ఇతర ప్రభుత్వరంగ పరిశ్రమల్లో గాని, ఇతర స్టీల్‌ప్లాంట్‌లలో ఎక్కడాలేని నిర్భందకాండ ప్రైవేటీకరణ అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నాగం పన్నారు.

10 సం॥లకు పైగా విశాఖ స్టీల్‌లో పర్మినెంట్‌ కార్మికుల రిక్రూట్‌మెంట్‌ లేదు. గత మూడు మాసాల్లో సుమారు 5వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా దుర్మార్గంగా తొలగించారు. అనుభవం మరియు నైపుణ్యం ఉన్న పర్మినెంట్‌ ఉద్యోగులు, ఆఫీసర్లను బలవంతంగా వి.ఆర్‌.ఎస్‌ ఇచ్చి ఇళ్ళకు పంపుతున్నారు. స్థానికులకు ఉపాధిలేకుండా చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కాంట్రాక్టర్లతో విశాఖ స్టీల్‌ నడపాలని కేంద్ర ప్రభుత్వం ప్రయిత్నిస్తున్నది. ఒకవైపున వేలాదిమంది నిర్వాశితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటే స్థానిక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిర్వాశితుల కాంట్రాక్ట్‌ కార్మికులతో పర్సనల్‌ ఆఫీస్‌కు మొహజర్లు సమర్పించమని మోసగిస్తున్నారు. ఇప్పుడున్న పర్మినెంట్‌ మరియు కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించి ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లు మరియు వారి మనుషులతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నడపాలని చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాం.