ఈఓఐ పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి...సిపిఎం డిమాండ్.



విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఈవోఐ పేరుతో 44 భాగాలుగా చేసి అమ్మడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, తక్షణం ఈ విధానం ఆపాలని డిమాండ్ చేసింది.



మంగళవారం సాయంత్రం మద్దిలపాలెం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే ఎస్ వి కుమార్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తాం అన్న కూటమి ప్రభుత్వం నేడు ఈఓఐ పేరుతో మోడీ ప్రభుత్వం 44 విభాగాలుగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ఈ ఓ ఐ పేరుతో ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని, ఇప్పటికే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పర్మినెంట్ కార్మికులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11 వ తారీఖున సాయంత్రం ఐదు గంటలకు కొత్త గాజువాక జంక్షన్ నుండి పాత గాజువాక వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తుందన్నారు. 



అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాన వక్తగా సిపిఐఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సభను విశాఖపట్నం ప్రజానీకం జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు, నాయకులు కే కుమారి, చంటి, పి వెంకట్రావు, కొండమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.