కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, మార్చి 30: జిల్లాలో ప్రజల భూ సంబంధిత సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్ మరియు పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు.



సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 178 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రతి అర్జీపై వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమస్యల స్వరూపం, పరిష్కార మార్గాలపై చర్చించారు.



ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం అందించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే అర్జీదారునికి సమాచారం అందించడంతో పాటు, పరిష్కారం కాని అర్జీలకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు. డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై స్థానిక స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు పైస్థాయికి వెళ్లే అవసరం లేకుండా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. 



ప్రతి శాఖ అధికారి తమ శాఖకు సంబంధించిన ఫిర్యాదుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులోపు పరిష్కారం చేయాలని సూచించారు. చిన్న సమస్యలైనా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని బాధ్యతగా తీసుకుని సమయపాలన, ప్రజాస్పందన, పారదర్శకత అనే మూడు సూత్రాల ఆధారంగా పరిపాలన కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జి మమ్మీ, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.