డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, మార్చి 30: మత్స్యకారుల కుటుంబాల ముంగిటకే వైద్య సేవలు – ‘మీ ఇంటికి మీ డాక్టర్’ మొబైల్ క్లినిక్ ప్రారంభించిన : జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.
ఆర్.ఈ.సి (REC) ప్రాజెక్ట్ సౌజన్యంతో జిల్లావ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ : జిల్లా కలెక్టర్.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి వద్దకే చేరవేసే లక్ష్యంతో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ అనే వినూత్న మొబైల్ క్లినిక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సహకారంతో మరియు REC Foundation సౌజన్యంతో అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ క్లినిక్ వాహనం ద్వారా జిల్లాలోని మత్స్యకార గ్రామాలకు నేరుగా చేరుకుని ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు వైద్య సదుపాయాలకు దూరంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో ఈ మొబైల్ క్లినిక్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శిశు మరణాల రేటు (IMR), మాతృ మరణాల రేటు (MMR) తగ్గించడం, అంటువ్యాధుల నియంత్రణ, గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని జిల్లా కలెక్టర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో సుమారు రూ.8.40 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతోందని తెలిపారు. జిల్లాలో ఈ సేవలు నిరంతరం కొనసాగేందుకు రెడ్ క్రాస్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్ ఏవో కాశి విశ్వేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు అవుతుండగా, జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ హరి శేషు మాట్లాడుతూ, ఈ మొబైల్ క్లినిక్ యూనిట్ ద్వారా ఒక డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్, డ్రైవర్‌తో కూడిన వైద్య బృందం నేరుగా గ్రామాలకు వెళ్లి సేవలు అందిస్తుందని తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం మాత్రమే కాకుండా, అవసరమైన మందులను కూడా అక్కడికక్కడే ఉచితంగా అందజేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తుందని చెప్పారు. మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు ఇది ఒక వరంగా మారుతుందని తెలిపారు.


