హిందూపురం: రాష్ట్ర ముస్లిం రచయితల సంఘం (ము.ర.సం) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హిందూపురంలో ము.ర.సం జాతీయ అధ్యక్షులు, ప్రముఖ కవి కరీముల్లా అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గ వివరాలు:
రాష్ట్ర అధ్యక్షులు: అబ్దుల్ హకీం (గుంటూరు)
ప్రధాన కార్యదర్శి: కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్
మరో ప్రధాన కార్యదర్శి: అబ్దుల్ సమద్ (నంద్యాల)
ఉపాధ్యక్షులు: ముహమ్మద్ షరీఫ్ (మండపేట)
సహాయ కార్యదర్శి: ఈవేమనా రఫీ
కోశాధికారి: బషీర్ అహ్మద్
మహిళా కార్యదర్శులు: బషీరున్నిసా బేగం, ఖుర్షీద్ బేగం, నసీమా బేగం
కార్యదర్శులు: ఎస్.ఎం. సుభాని మరియు తదితరులు.
లౌకిక విలువలు, దేశ సమైక్యతకై 'మురసం' కృషి: ఉమర్ ఫారూఖ్ ఖాన్
ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శి కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ... ముస్లింల విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, మత సామరస్యం, పరమత సహనంతో పాటు వసుధైక కుటుంబ నిర్మాణానికి 'ము.ర.సం' కట్టుబడి పని చేస్తుందని స్పష్టం చేశారు. లౌకిక, రాజ్యాంగ విలువల పరిరక్షణకు, తెలుగు భాషాభివృద్ధికి నూతన కార్యవర్గం ప్రతిన బూనినట్లు ఆయన తెలిపారు.
"అన్ని రకాల మతోన్మాదాలను, మత ఉగ్రవాదాలను ము.ర.సం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దేశ సమైక్యతను కాపాడుతూ... అన్ని ప్రగతిశీల, లౌకిక, పీడిత, అణగారిన, దళిత, బహుజన సాహితీ శిబిరాలకు మా సంఘీభావం ఎల్లప్పుడూ ఉంటుంది."— కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్.
భవిష్యత్తు ప్రణాళికలు: కార్యవర్గ విస్తరణ: ఇప్పటికే పలు జిల్లాల్లో ఉన్న శాఖలను మరింత బలోపేతం చేస్తామని, శాఖలు లేని చోట త్వరలోనే జిల్లా కన్వీనర్లు, కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. సాహిత్య కార్యక్రమాలు: కవిసమ్మేళనాలు, కవిత్వం, కథ, వ్యాసాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు, సెమినార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర మహాసభలు: అతి త్వరలోనే ము.ర.సం రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే జాతీయ అధ్యక్షులు కరీముల్లా, రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ హకీంలతో కలిసి తాము అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఉమర్ ఫారూఖ్ ఖాన్ పేర్కొన్నారు.

