తండ్రి అడుగుజాడల్లో... షిప్‌యార్డ్‌కు అంకితమైన జీవితం

"ఉద్యోగం అంటే కేవలం ఉపాధి కాదు... మనం ప్రేమించిన సంస్థ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేయడం కూడా ఒక సేవే" అనే భావనకు ఉల్లా కొండబాబు జీవితం నిలువెత్తు నిదర్శనం. తండ్రి అడుగుజాడల్లో ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో నిబద్ధతకు, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది". ఇలాంటి కార్మికులు, ఉద్యోగులు, నిస్వార్థ కార్మికులు, అంకితభావం సేవ తత్పరత ఎందరో వివిధ హోదాల్లో ఉన్నారు.  



తండ్రి అడుగుజాడల్లో... షిప్‌యార్డ్‌కు అంకితమైన జీవితం. తండ్రికి క్యారేజీ మోసిన టీనేజీ బాలుడు... నేడు షిప్‌యార్డ్‌కు ఆదర్శ ఉద్యోగి – ఉల్లా కొండబాబు సేవలకు ప్రశంసలు. కొన్ని బంధాలు ఉద్యోగంతో ఏర్పడవు... చిన్ననాటి జ్ఞాపకాలతో, అనుబంధంతో మొదలై జీవితాంతం కొనసాగుతాయి. అలాంటి అరుదైన అనుబంధమే హిందుస్థాన్ షిప్‌యార్డ్‌తో ఉల్లా కొండబాబు. బాల్యంలో తన తండ్రి ఉల్లా అప్పలస్వామికు భోజన క్యారేజీ తీసుకెళ్లే సందర్భాల్లో షిప్‌యార్డ్‌లోని భారీ నౌకలు, సముద్రపు ఒడ్డు, పనుల్లో నిమగ్నమైన కార్మికులను చూసి పరవశించేవాడు. ఆ దృశ్యాలు అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. అప్పుడే షిప్‌యార్డ్‌పై ప్రేమ, గౌరవం, అనుబంధం పెరిగాయి.



అయితే విధి ఒక్కసారిగా అతని జీవితాన్ని మార్చేసింది. తండ్రి అప్పల స్వామి మరణించడంతో 18 ఏళ్ళ యుక్తవయసులోనే వయసులో అమ్మ, ఇద్దరు తమ్ముళ్ళ కుటుంబ పోషణ బాధ్యతలు భుజాన పడ్డాయి. ఆ పరిస్థితుల్లో జూన్ 1992లో కుటుంబ వారసత్వం ఆధారంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఉల్లా కొండబాబు తాత్కాలిక కళాశీగా ఉద్యోగంలో చేరారు. చేరిన నాటి నుంచి పనిపట్ల అంకితభావం, క్రమశిక్షణ, సంస్థపట్ల నిబద్ధతతో విధులు నిర్వర్తించిన ఆయన తన ప్రతిభతో సీనియర్ మాస్టర్ గ్రేడ్ పదోన్నతి సాధించారు. ఉద్యోగ జీవితంలో ఐటీ, సేఫ్టీ, సీఎండీ కార్యాలయంలో విధులు, తదితర విభాగాల్లో సేవలందిస్తూ సంస్థకు విశ్వసనీయ ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రిగ్గింగ్ విభాగంలో సీనియర్ మాస్టర్ ట్రేడ్ మెన్ (mtm)ఉద్యోగిగా పనిచేస్తున్న ఉల్లా కొండబాబు, తనతో పాటు పనిచేసే యువ ఉద్యోగులకు నౌకలను సురక్షితంగా కట్టడం, వివిధ రకాల తాళ్ల అల్లికలు, సముద్ర నౌకాయానంలో ఉపయోగించే ప్రత్యేక ముడులు వేయడం వంటి నైపుణ్యాలను ఎంతో ఓర్పుతో నేర్పిస్తున్నారు. తనకు తెలిసిన అనుభవాన్ని తదుపరి తరానికి అందించడమే నిజమైన బాధ్యతగా భావించడం ఆయనృ ప్రత్యేకత. 

ఇటీవల హిందుస్థాన్ షిప్‌యార్డ్ రక్షణ రంగ విభాగం అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ (ఆక్విజేషన్) ఏ.అన్బరసు ఐఎఎస్ సీఎండీతో పాటూ సంస్థలో పర్యటించారు.  సందర్భంగా ఉద్యోగులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఆ సందర్భంగా ఉల్లా కొండబాబు ( B-339)తో జరిగిన సంభాషణలో ఆయన పనిపట్ల ఉన్న అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత, సంస్థపట్ల విశ్వాసం ఉన్నతాధికారి కి ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల సంస్థను సందర్శించిన ఐఏఎస్ అధికారి కూడా ఆయనతో ఆప్యాయంగా పలకరించడం, ఆయన సేవలను అభినందించడం విశేషంగా నిలిచింది.