ఆంధ్రరత్న భవన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి
అరకు, జూలై 25: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌పై బీజేపీకి చెందిన వ్యక్తులు దాడి చేయడం అత్యంత దారుణమైన ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి తీవ్రంగా ఖండించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 135 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం రాజ్యాంగ విలువలపై దాడి చేయడమేనని అన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పరీక్ష అక్రమాలు, ప్రజాధన వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకు రాజకీయ కక్షతోనే ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
దాడి ఘటనలో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ తీవ్రంగా గాయపడి కుడికాలుకు ఫ్రాక్చర్ కావడం, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలు కావడం బాధాకరమన్నారు. శాంతియుతంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఆంధ్రరత్న భవన్‌పై జరిగిన దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరారు.
రాజకీయ విభేదాలకు హింస ఎప్పటికీ పరిష్కారం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి కిషన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్‌తో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



