హెచ్‌ఎస్‌ఎల్ నుంచి నౌకాదళానికి ‘ఐఎన్‌ఎస్ నిపుణ్’
సముద్రగర్భ వ్యూహాత్మక సామర్థ్యానికి మరింత బలం
విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) నిర్మించిన అత్యాధునిక డైవింగ్ సపోర్ట్ వెసెల్ ‘ఐఎన్‌ఎస్ నిపుణ్’ను భారత నౌకాదళానికి శుక్రవారం అధికారికంగా అందజేశారు. ఈ నౌక నౌకాదళంలో చేరడంతో సముద్రగర్భ వ్యూహాత్మక సామర్థ్యంతో పాటు సముద్ర భద్రతా సన్నద్ధత మరింత బలోపేతం కానుంది.
గతేడాది ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ను నౌకాదళానికి అందజేసిన హెచ్‌ఎస్‌ఎల్, ఏడాది వ్యవధిలోనే మరో అత్యాధునిక డైవింగ్ సపోర్ట్ వెసెల్ ‘ఐఎన్‌ఎస్ నిపుణ్’ను నిర్మించి అందజేయడం విశేషం. స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం సాధిస్తున్న పురోగతికి ఇది మరో కీలక మైలురాయిగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
డెలివరీ ఒప్పంద పత్రాలపై భారత నౌకాదళం వెస్ట్రన్ నేవల్ కమాండ్ సీఎస్‌ఓ (టెక్) రియర్ అడ్మిరల్ అర్వింద్ రావల్, వీఎస్‌ఎం, హెచ్‌ఎస్‌ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురాం, వీఎస్‌ఎం (రిటైర్డ్) సంతకాలు చేశారు.
118 మీటర్ల పొడవు, 8,560 టన్నుల సామర్థ్యం కలిగిన ‘ఐఎన్‌ఎస్ నిపుణ్’లో సుమారు 80 శాతం స్వదేశీ పరికరాలను వినియోగించారు. డైనమిక్ పొజిషనింగ్, సాచ్యురేషన్ డైవింగ్, సబ్‌మెరైన్ రెస్క్యూ, డీప్-సీ ఇంటర్వెన్షన్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. సముద్రగర్భ కార్యకలాపాలతో పాటు సబ్‌మెరైన్ రెస్క్యూ, లోతైన సముద్రంలో నిర్వహించే ప్రత్యేక ఆపరేషన్లలో ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, నౌకా నిర్మాణ సామర్థ్యాల పెంపులో హెచ్‌ఎస్‌ఎల్ మరో కీలక విజయాన్ని నమోదు చేసిందని అధికారులు తెలిపారు.





