25 ఏళ్ల నిరంతర రక్తదాన సేవలకు అరుదైన గుర్తింపు
‘ది హ్యుమానిటేరియన్ లీడర్ ఇన్ బ్లడ్ డొనేషన్ సర్వీస్’ టైటిల్ ప్రదానం
సాహితీవేత్తలు, సేవా ప్రముఖుల అభినందనలు
హిందూపురం: సామాజిక సేవ, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖ సేవాకర్త, టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. గత పాతికేళ్లుగా నిరంతరాయంగా రక్తదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను ఆయన పేరు ‘జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదైంది. ఈ మేరకు సంస్థ ఆయనకు “ది హ్యుమానిటేరియన్ లీడర్ ఇన్ బ్లడ్ డొనేషన్ సర్వీస్ ఫర్ 25 కాన్సిక్యుటివ్ ఇయర్స్” పేరిట ధ్రువపత్రాన్ని ప్రదానం చేసింది.
26 వేల మందికి పైగా ప్రాణదానం – 66 సార్లు స్వచ్ఛంద రక్తదానం
శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు, భారతీయ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్.. టిప్పు సుల్తాన్ షహీద్ మానవతా రక్తదాన సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని బాధితులకు అండగా నిలుస్తున్నారు. తలసేమియా పీడిత చిన్నారులు, అత్యవసర ప్రసవాలు, శస్త్రచికిత్సలు, రక్తహీనతతో బాధపడే మహిళలకు ఇప్పటివరకు 26,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సమకూర్చారు. అంతేకాకుండా, ఆయన స్వయంగా 66 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానంతో పాటు అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయనకు ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి.
కులమతాలకు అతీతంగా మానవతా సేవ: ఉమర్ ఫారూఖ్ ఖాన్
ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. "రక్తదానం చేద్దాం - ప్రాణదాతలుగా మారుదాం, కులమతాల అడ్డుగోడలు కూల్చి వసుధైక కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ గుర్తింపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్‌కు స్థానిక సాహితీవేత్తలు, రచయితలు, సేవా సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు మరియు అభిమానులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.




