టెక్కలి: మాతృప్రేమకు మించినది లోకంలో ఏదీ లేదని, కన్నతల్లి జ్ఞాపకార్థం ఆకలితో ఉన్న పేదలకు అన్నం పెట్టడం కంటే గొప్ప నివాళి మరొకటి ఉండదని నిరూపించారు శ్రీకాకుళం B2B స్టాఫ్ రిపోర్టర్ శతపతి ప్రసాదరావు.
ఆయన మాతృమూర్తి గతంలో భాద్రపద బహుళ దశమి నాడు పరమపదించారు. ఈ సందర్భంగా ఆమె శ్రార్థ దినాన్ని పురస్కరించుకుని టెక్కలిలోని ప్రముఖ సేవా సంస్థ ‘అభయ ఫుడ్’ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, అంధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శతపతి ప్రసాదరావు మాట్లాడుతూ, తన తల్లి స్మృతిగా పేదలకు ఆకలి తీర్చే సదవకాశాన్ని కల్పించిన అభయ ఫుడ్ సంస్థ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అన్నదాన ఫలితం తన మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని శుభకార్యాలు, పెద్దల జ్ఞాపకార్థ దినాల్లో నిరుపేదల ఆకలిని తీర్చేలా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నదానం నిర్వహించడం తనకు ఎనలేని మానసిక ప్రశాంతతను, తృప్తిని ఇచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

