సీనియర్ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ రైల్వేస్‌కు స్వర్ణం
సత్తా చాటిన సౌత్ కోస్ట్ రైల్వే క్రీడాకారులు
సీహెచ్. వెంగళ్ రావుకు ప్రతిష్టాత్మక 'స్టార్ ఆఫ్ ఇండియా' అవార్డు
విజేతలను అభినందించిన వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వేదికగా సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు జరిగిన 72వ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (2026-27)లో ఇండియన్ రైల్వేస్ జట్టు ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ టోర్నమెంట్‌లో ఇండియన్ రైల్వేస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సౌత్ కోస్ట్ రైల్వేకు చెందిన ముగ్గురు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. రైల్వే ఉద్యోగులైన సీహెచ్. వెంగళ్ రావు (సీనియర్ క్లర్క్), డి.వి. గణేష్ (టెక్నీషియన్-I), పి. కార్తీక్ (సీసీటీసీ) టోర్నీ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
టోర్నీలో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న సీహెచ్. వెంగళ్ రావుకు ప్రతిష్టాత్మక “స్టార్ ఆఫ్ ఇండియా” అవార్డు లభించింది. ఇండియన్ రైల్వేస్ జట్టు చాంపియన్‌గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించిన క్రీడాకారులను విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) శ్రీ లలిత్ బోహ్రా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ వారు ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

