రాష్ట్ర పురోగతికి రథసారథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్
పెద్ద హరివాణంలో రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులు
ఏపీ కురుబ/కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప
ఆదోని: రాష్ట్రంలోని పల్లెలను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కురుబ/కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామాలు సరికొత్త రూపురేఖలు సంతరించుకుంటున్నాయని ఆయన కొనియాడారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మేజర్ పంచాయతీ పెద్ద హరివాణం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. 2 కోట్ల పైచిలుకు నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతంగా సాగాయని ఆయన తెలిపారు. గ్రామంలో పల్లె పండుగ 1.0 కింద రూ. 75 లక్షలు, పల్లె పండుగ 2.0 కింద రూ. 90 లక్షలతో అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి కాగా, ప్రస్తుతం పల్లె పండుగ 3.0 కింద మరో రూ. 45 లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో గ్రామం మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దబడుతుందని చెప్పారు. గ్రామ ఈశాన్య దిశలోని రోడ్డు పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన స్థానిక హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ. 25 లక్షలు మంజూరు చేసి పూర్తి చేసిందని దేవేంద్రప్ప పేర్కొన్నారు. బీసీ జనాభా అధికంగా ఉన్న పెద్ద హరివాణంలో రూ. 25 లక్షల వ్యయంతో ‘బీసీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్’ మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో గ్రామంలో గ్రావెల్ రోడ్లు లేకుండా అన్నింటినీ పక్కా సీసీ రోడ్లుగా మారుస్తామని భరోసా ఇచ్చారు.
పాతికేళ్ల నిరీక్షణకు తెర.. నాడంగ రోడ్డు పనులు ప్రారంభం
పెద్ద హరివాణం నుంచి సరిహద్దు గ్రామాలైన నాడంగ, అగసనూర్, రవిహాలు, బీరల్లి, గుబ్యాళ్, కొత్తలచింత, బొమ్మనాలు, హచ్చోల్లి మీదుగా కర్ణాటకకు వెళ్లే ప్రధాన రహదారి దాదాపు 25 ఏళ్లుగా అధ్వానంగా ఉండటంతో రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఆయన గుర్తుచేశారు. ఈ సమస్యను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే రూ. 1.5 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈరోజు పెద్ద హరివాణం నుంచి ఆంధ్ర సరిహద్దు (నాడంగ రోడ్డు) వరకు పనులను ప్రారంభించడంతో స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బి.పి. బసవరాజు, సొసైటీ చైర్మన్ ఆదిశేషారెడ్డి, జడ్పీ స్కూల్ చైర్మన్ బి.పి. అయ్యన్న, ఎల్ఎల్సీ కెనాల్ చైర్మన్ గురులింగ, లక్ష్మమ్మ చెరువు చైర్మన్ కుప్పం సోమ, మాజీ ఎంపీటీసీ ఎన్. నాగరాజు, కొటెకల్ నాగప్ప, బీజేపీ నాయకులు రంగనాథరెడ్డి, బోయ రాగప్ప, కటిక నర్సోజీరావు, జనసేన నాయకుడు వీరేష్ యాదవ్ తో పాటు కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



