భారత ఎన్నికల సంఘం గుర్తింపుతో ‘గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ’ ఆవిర్భావం
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ: వ్యవస్థాపక అధ్యక్షుడు కొండిశెట్టి సురేష్ బాబు
విజయవాడ (అక్టోబర్ 6):
భారత రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడి, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం ‘గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ’ అధికారికంగా రిజిస్టర్ కాబడిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండిశెట్టి సురేష్ బాబు స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ పేరును, తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా అసత్య ప్రచారాలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత హక్కులకు భంగం కలిగిస్తూ దుష్ప్రచారం సాగిస్తున్న వారిపై తీవ్ర న్యాయపరమైన, చట్టరీత్యా చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ అసత్య ప్రచారాలపై రాష్ట్ర హోం శాఖ, సమాచార శాఖ మంత్రులకు మరియు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ సంపూర్ణ అర్హత కలిగి ఉందని సురేష్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించామని, ప్రతి నియోజకవర్గం నుంచి సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక ప్రణాళికా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ పార్టీపై బురదజల్లాలని చూస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
విడుదల చేసిన వారు:
కొండిశెట్టి సురేష్ బాబు
వ్యవస్థాపక అధ్యక్షులు,
గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ, విజయవాడ.

