దసరా పండుగకు విశాఖ నుంచి 420 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఆర్‌ఎం బి. అప్పలనాయుడు
విశాఖపట్నం: దసరా ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం రీజియన్ నుంచి వివిధ ప్రాంతాలకు సుమారు 420 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ విశాఖ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) శ్రీ బి. అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు విశాఖ రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రత్యేక బస్సులు ఈనెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర దూర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు, విజయనగరం మార్గాల్లో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.
విజయనగరం జోన్ పరిధిలోని ఆరు జిల్లాల్లో ప్రయాణికుల రద్దీని బట్టి మొత్తం 1,100కు పైగా బస్సులను నడపడానికి ప్రణాళిక రూపొందించారు. విశాఖపట్నం కేంద్రంగా రానుపోను ప్రయాణాలకు కూడా రద్దీ మేరకు బస్సులను నడుపుతామని, ఈ ప్రత్యేక సర్వీసుల్లో ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలతోనే రవాణా సదుపాయం కల్పిస్తున్నామని ఆర్‌ఎం స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.




