ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కె.జి.హెచ్) ప్రాంగణంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'సేవా సంకల్ప' ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ పి. జగదీశ్వర రావు పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో పలు వైద్య విభాగాలు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి రోగులకు సేవలందించాయి.
ఈ సందర్భంగా వ్యాధి నిరోధక టీకాలు, కుష్టు (లెప్రసీ), క్షయ నివారణ, ఆర్.బి.ఎస్.కె., హై రిస్క్ ప్రెగ్నెన్సీ విభాగాలతో పాటు మలేరియా, డెంగ్యూ నియంత్రణపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు నేరుగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స, మందులు అందించారు.
ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం అవసరం: ఈ వైద్య శిబిరంలోని స్టాళ్లను గౌరవ శాసనసభ్యులు పి. విష్ణు కుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పరిశీలించారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం-జేవై, ఆయుష్, మహిళా సంరక్షణ వాక్సినేషన్ వంటి పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన స్వయంగా రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని, ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆర్. నరేంద్ర సింగ్, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ & డిప్యూటీ కలెక్టర్ బి.వి. రమణ, డీఎల్ఏటీవో డాక్టర్ ఆర్. రమేష్, డీఐవో డాక్టర్ లూసీ, డీపీఎంవో డాక్టర్ బి. ఉమావతి, ఆర్.బి.ఎస్.కె. సమన్వయకర్త డాక్టర్ బి. హారిక, ఎన్టీఆర్ వైద్యసేవ సమన్వయకర్త డాక్టర్ కె. అప్పారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. కిరణ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, డీఎస్వో డాక్టర్ ప్రదీప్ రాజా, డీపీవో జి. శశిభూషణ్, ఏపీఎంవో బి. నాగభూషణం సహా పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.



