కోసిగి నుంచే ఉద్యమ ప్రారంభం
రాష్ట్రంలో 2,000 పాఠశాలలు మూతపడటం దారుణం: ఎస్‌ఎఫ్‌ఐ ధ్వజం
ఆదోని, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధనే లక్ష్యంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘స్కూల్ బచావో’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి ప్రకటించారు. దేశంలోనే అత్యధిక నిరక్షరాస్యత నమోదైన ప్రాంతాల్లో ఒకటైన కోసిగి నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆదివారం ఆదోని పట్టణంలోని రణమండలం సమీపంలో గల పురాతన మఠంలో ఎస్‌ఎఫ్‌ఐ కర్నూలు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రంగప్ప మాట్లాడుతూ... నూతన విద్యా విధానం (NEP) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేయడం దుర్మార్గమన్నారు.
కర్నూలు జిల్లాలోని మెజారిటీ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కరవయ్యాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా తరగతి గదులు, తాగునీరు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. తీవ్రమైన ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు నిర్వహించే ఈ ‘స్కూల్ బచావో’ పోరాటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు శశిధర్, ఆర్యన్, రామకృష్ణ, రాము, సంజయ్, దేవాన్ష్, సింధుతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

