సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీఎంహెచ్‌వో, డాక్టర్ కార్తీక్
విశాఖపట్నం, అక్టోబర్ 2: పరిసరాల పరిశుభ్రత, నాణ్యమైన ప్రజారోగ్య సేవల్లో విశేష ప్రతిభ కనబరిచిన నగరంలోని చినముషివాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026’ను దక్కించుకుంది. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా విశాఖ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ పి. జగదీశ్వరరావు, డాక్టర్ కార్తీక్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఆరోగ్య కేంద్రంలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు అందించడం, పరిసర ప్రజల్లో స్వచ్ఛతపై నిరంతర అవగాహన కల్పించడంలో చూపిన చొరవను గుర్తించి ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ, చినముషివాడ యూపీహెచ్‌సీకి రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కడం జిల్లాకే గర్వకారణమన్నారు. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో సేవలందించడం వల్లే ఈ అవార్డు సాధ్యమైందని, జిల్లాలోని అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

