సచివాలయాల ఎదుట వామపక్షాలు, ప్రజాసంఘాల ధర్నా
ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి
పంట రుణాలు మాఫీ చేసి, ఉపాధి హామీ కూలీ రూ.700 చెల్లించాలని వినతి
ఆదోని గ్రామీణం: ఆదోని మండలాన్ని ప్రభుత్వం తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, యుద్ధప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ, ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మరియు చేతి వృత్తిదారుల సమాఖ్య డిమాండ్ చేశాయి. ఈ మేరకు మండల పరిధిలోని దొడ్డనగేరి, మంత్రికే, పెసరబండ, కపిటి గ్రామ సచివాలయాల ఎదుట నాయకులు, రైతులు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు సీపీఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఓబి నాగరాజు, పట్టణ కార్యదర్శి వై.టి. భీమేష్ మాట్లాడుతూ... ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కురిసిన అరకొర వర్షాలకు రైతులు ఎంతో నమ్మకంతో పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, ఉల్లి, టమోటా తదితర పంటలు సాగు చేశారన్నారు. విత్తనాలు విత్తి నాలుగు నెలలు గడిచినా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితిలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని వాపోయారు.
ప్రధాన డిమాండ్లు:
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50,000 చొప్పున పరిహారం చెల్లించాలి.
బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాలను రూ.2 లక్షల వరకు తక్షణమే రద్దు చేయాలి.
పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) పరిహారాన్ని తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం రైతులకు ఉచితంగా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలి.
పశుగ్రాసం లేక పశువులు అల్లాడుతున్నందున ఉచితంగా పశుగ్రాసాన్ని సరఫరా చేయాలి.
వలసల నివారణకు గ్రామీణ ఉపాధి హామీ పనులను ముమ్మరం చేసి, రోజువారీ కూలీని రూ.700లకు పెంచాలి.
కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రతి పేద కుటుంబానికి రూ.20,000 కరువు పెన్షన్ (ఆర్థిక సాయం) అందించాలి.
రేషన్ దుకాణాల ద్వారా 15 రకాల నిత్యావసర సరుకులను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలి.
గ్రామాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోతే భవిష్యత్తులో సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొత్తూరు గంగన్న, మాజీ సర్పంచ్ హనుమంతు, సీపీఐ నాయకులు శంకరయ్య, తలారి రాజు, శేషురెడ్డి, మునిస్వామి తదితర నాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




