అక్రమ సంబంధం నేపథ్యంలో తోడల్లుడి దారుణ హత్య: ఇద్దరు నిందితుల అరెస్ట్

​ఆదోని (క్రైమ్ న్యూస్): మరదలితో ఏర్పడిన వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో తోడల్లుడిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటనలో నిందితులతో పాటు, హత్యకు ప్రేరేపించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.



​ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమరావతి నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లలో అక్క అఖిలను చిన్న హరివాణానికి చెందిన గిడ్డయ్య గారి వీరేష్, చెల్లెలు శైలజను అరికెర గ్రామానికి చెందిన వీరేష్ వివాహం చేసుకున్నారు. కాగా, గిడ్డయ్య గారి వీరేష్‌కు తన మరదలు శైలజతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి అరికెర వీరేష్ తరచూ భార్య శైలజతో గొడవపడుతూ ఆమెపై చేయి చేసుకునేవాడు. ఈ వేధింపుల గురించి శైలజ తన బావ గిడ్డయ్య గారి వీరేష్‌కు ఫోన్‌లో చెబుతూ, తన భర్తను చంపాలని లేదా తననైనా చంపాలని కోరింది.

​ఈ క్రమంలో గణేష్ నిమజ్జనం కోసం ఇరు కుటుంబాలు అమరావతి నగర్‌కు వచ్చాయి. అక్కడ డ్యాన్స్ చేయడానికి రమ్మని పిలిచినప్పుడు శైలజ నిరాకరించడంతో ఆగ్రహించిన భర్త వీరేష్ ఆమెను కాలితో తన్నాడు. ఆ సమయంలో వీరేష్ తీరుపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్న గిడ్డయ్య గారి వీరేష్, అతడిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు.

​తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్దామని నమ్మించి అరికెర వీరేష్‌ను బయటకు తీసుకెళ్లి, మొదట లుంగీతో గొంతు బిగించేందుకు యత్నించాడు. ఆ పెనుగులాటలో మృతుడు నిందితుడిపై కొరికి ప్రతిఘటించినప్పటికీ, నిందితుడు అతడిని కిందకు తోసి ఛాతీపై (శైలజ పచ్చబొట్టు ఉన్న చోట) కత్తితో పొడిచి, అనంతరం గొంతు కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.

​ఈ ఘటనపై క్రైమ్ నెం. 87/2026 U/s 103(1) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు పాల్పడిన గిడ్డయ్య గారి వీరేష్‌తో పాటు, భర్తను చంపేందుకు ప్రేరేపించిన శైలజను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.