ఆదోనిని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి
ఎకరాకు ₹50 వేల నష్టపరిహారం చెల్లించాలి
గ్రామ సచివాలయాల ఎదుట సిపిఐ, ప్రజాసంఘాల ధర్నా
ఆదోని, సెప్టెంబరు 26: రాష్ట్రంలో తీవ్ర కరవు తాండవిస్తూ అన్నదాతలు వలసబాట పడుతుంటే, కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని సిపిఐ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదోని మండలాన్ని వెంటనే కరవు మండలంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం మండిగిరి, సాదాపురం, గోనబావి గ్రామ సచివాలయాల ఎదుట సిపిఐ, ఏఐటీయూసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, మండల కార్యదర్శి కల్లుబావి రాజు, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఓబీ నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి నీరు, తినడానికి తిండి లేక, పశువులకు గ్రాసం కరువై రైతులు తమ పశువులను కబేళాలకు అతి తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. బతుకుదెరువు కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ మెప్పు పొందేందుకే ప్రాధాన్యమిస్తున్నారని, ప్రజాధనాన్ని పుట్టినరోజులు, విహారయాత్రలకు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
పంటల బీమా పేరుతో రైతులకు గడువు తక్కువగా ఇచ్చి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని, తీరా ఆదుకోవాల్సిన సమయంలో కరవు మండలంగా ప్రకటించకుండా అన్నదాతలను నట్టేట ముంచారని ఆరోపించారు. మండల పరిధిలోని రైతులకు ఎకరాకు ₹50,000 పంట నష్టపరిహారం చెల్లించాలని, ఇన్సూరెన్స్ సొమ్మును తక్షణమే విడుదల చేయాలని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరవు సహాయక చర్యలు చేపట్టకపోతే, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వై.టి. భీమేష్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తూరు గంగన్న, సిపిఐ నాయకులు, మాజీ సర్పంచ్ హనుమంతు, మండిగిరి శేషప్ప, రంగన్న, హరిబాబుతో పాటు పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


