ప్రజారోగ్యాన్ని బలితీసుకుంటున్న గంగవరం పోర్టు కాలుష్యం

యాజమాన్యంతో నాలుగు గ్రామాల కమిటీ చర్చలు

సిఎస్ఆర్ (CSR) నిధులతో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి: సిఐటియు నేత నమ్మి రమణ డిమాండ్



పెదగంట్యాడ: గంగవరం పోర్టు నుంచి వెలువడుతున్న తీవ్రమైన కాలుష్యం, పెదగంట్యాడ నుండి గంగవరం వెళ్లే భారీ వాహనాల రాకపోకల సమస్యలపై పోర్టు యాజమాన్యంతో ప్రభావిత నాలుగు గ్రామాల కమిటీ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నమ్మి రమణ మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ప్రజలు బతికుంటేనే కదా పరిశ్రమలు, ఫ్యాక్టరీలు నడిచేది? ప్రజల ప్రాణాలే పోతుంటే పరిశ్రమలు ఎవరి కోసం?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గంగవరం పోర్టు కాలుష్యం వల్ల చిన్నారులు తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో అల్లాడుతుండగా, వృద్ధులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



2008 నుంచి నరకయాతన:

2008లో పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని పేర్కొన్నారు. ఇళ్ల డాబాలపై బట్టలు ఆరేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొందని, రాత్రిపూట స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఎప్పుడో కనుమరుగైందన్నారు. ఇళ్లకే పరిమితమైనా దుమ్ము, ధూళి వదలడం లేదని, బయటకు వస్తే పరిస్థితి మరింత భయానకంగా మారిందని తెలిపారు. కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనల ప్రకారం కాలుష్యం 50 నుండి 100 వరకు ఉండాల్సి ఉండగా, ఇక్కడ ఏకంగా 500 శాతానికి మించి పెరిగిపోయిందని పొల్యూషన్ కంట్రోల్ అధికారులే చెబుతున్నారని గుర్తుచేశారు.

సమావేశంలో గ్రామాల కమిటీ పెట్టిన ప్రధాన డిమాండ్లు:

 * బొగ్గు (కోల్) నిల్వల కోసం వెంటనే మూసివుండే ప్రత్యేక స్టోరేజ్ గూడెంలు (క్లోజ్డ్ షెడ్స్) నిర్మించాలి.

 * బొగ్గును రవాణా చేసే కన్వేయర్ బెల్టులకు ఎలాంటి లీకేజీలు లేకుండా పూర్తిగా షెడ్లు ఏర్పాటు చేయాలి.

 * బొగ్గు నిల్వలు గాలికి ఎగరకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాటరింగ్ చేయాలి.

 * ప్రస్తుతం ఉన్న 12 అడుగుల ప్రహరీ గోడను కనీసం 20 అడుగులకు పెంచాలి.

 * గోడ చుట్టూ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేస్తూ పెద్ద ఎత్తున చెట్లు నాటాలి.

 * పోర్టు నుండి బయటకు వెళ్లే భారీ లోడు బొగ్గు లారీలపై పూర్తిగా టార్పాలిన్ కప్పకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు అనుమతించకూడదు. 

* పోర్టు సిఎస్ఆర్ (CSR) నిధులను పూర్తిగా ఉపయోగించి తక్షణమే కాలుష్య నివారణ పనులు చేపట్టాలని కమిటీ నాయకులు తేల్చిచెప్పారు. 

* ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని, సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే నాలుగు గ్రామాల ప్రజలను సమీకరించి పోర్టు కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో ప్రభావిత నాలుగు గ్రామాల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.