లిక్కర్ స్కాం నుంచి దృష్టి మళ్లించేందుకే డీఎస్సీపై జగన్ విష ప్రచారం

కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు..

ఏపీ కురుబ/కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఫైర్..



అమరావతి: గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఏపీ స్టేట్ కురుబ/కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని మహిళలకు మాయమాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి రాగానే ప్రముఖ బ్రాండ్లను నిషేధించి, సొంత బినామీలతో నాసిరకం మద్యాన్ని తయారు చేయించి రాష్ట్రమంతటా విక్రయించారని మండిపడ్డారు. నాసిరకం మద్యం తాగి వందలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మద్యం మాఫియాలో జగన్‌తో పాటు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప తదితరులు కీలకంగా వ్యవహరించి, డిజిటల్ చెల్లింపులు లేకుండా పూర్తిగా నగదు రూపంలోనే వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అప్పటి ఎక్సైజ్ ఓఎస్డీ సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంతో నెలకు రూ.60 కోట్ల చొప్పున దాదాపు రూ.3,200 కోట్ల దోపిడీ బట్టబయలైందని స్పష్టం చేశారు. ఈ అక్రమాలను భరించలేకే 2024 ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల మోములో చిరునవ్వులు చూసి ఓర్వలేకపోతున్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని జగన్, నేడు డీఎస్సీపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో విద్యారంగాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీని చేపట్టి అర్హులైన పేద, మధ్యతరగతి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. వేలాది కుటుంబాల్లో చిగురించిన ఆనందాన్ని చూసి ఓర్వలేకనే వైకాపా నేతలు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుట్ర రాజకీయాలు మానుకోకపోతే రాష్ట్రంలో ఆ పార్టీకి నామరూపాలు కూడా లేకుండా పోతాయని దేవేంద్రప్ప హెచ్చరించారు.