కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్పొరేషన్, తొలి విడత పంచాయతీ ఎన్నికలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరిక



రాజమహేంద్రవరం: ఈ నెల 26వ తేదీన జరగనున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికలతో పాటు కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సర్వసన్నద్ధమైందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్‌లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రజలు, అభ్యర్థులు పాటించాల్సిన ప్రధాన నిబంధనలు:

నిషేధాజ్ఞలు (సెక్షన్ 163 BNSS): ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురికి మించి గుమిగూడటం పూర్తిగా నిషేధం.

ప్రలోభాలపై ఉక్కుపాదం: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేసినా, ఓటర్లను భయపెట్టినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాము.

సోషల్ మీడియా నిఘా: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) ప్రతి ఒక్కరూ పాటించాలి. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేస్తే సైబర్ క్రైమ్ ద్వారా కఠిన చర్యలు ఉంటాయి. దీనికి గ్రూప్ అడ్మిన్‌లు కూడా బాధ్యులవుతారు.

విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: ఎన్నికల ఫలితాల అనంతరం ముందస్తు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం, బాణసంచా కాల్చడం, రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషేధం.

సంయమనం & చట్టబద్ధత: ఫలితాల అనంతరం ప్రత్యర్థులను రెచ్చగొట్టడం, దాడులు లేదా ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు. ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. ప్రజలంతా ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు