ట్రాఫిక్ పోలీసులకు 200 కూలింగ్ హెల్మెట్ల పంపిణీ.

ట్రాఫిక్ పోలీసులకు 200 కూలింగ్ హెల్మెట్లతో పాటు, 64 ద్విచక్ర వాహనాలు రెండు డ్రోన్లు అందించిన హోం మంత్రి అనిత.



మహారాణిపేట, జులై 7:  పోలీస్ సిబ్బంది భద్రత సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుపుచ్చుకొని పోలీస్ శాఖలో మార్పులు తీసుకొస్తున్నామని సిబ్బందికి సౌకర్యాలు కల్పిస్తేనే సమర్థంగా పనిచేస్తారని అభిప్రాయపడ్డారు. సోమవారం బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం వద్ద నిర్వహించిన సమావేశంలో, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి 200 కూలింగ్ హెల్మెట్లు, 64 ద్విచక్ర వాహనాలను అందజేసి హోంమంత్రి అనిత మాట్లాడారు.



పోలీసుల సంక్షేమం కోసం కమిషనర్ డాక్టర్ శంఖ బ్రాత బాక్చి కృషి చేస్తున్నారని కొనియాడారు. కమిషనర్ బాక్చి మాట్లాడుతూ ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి తలకు చల్లదనాన్ని అందించేలా, విశాఖ పోర్ట్ అథారిటీ, సౌత్ ఏషియా ఎల్పిజి సంస్థ సహకారంతో సుమారు 46 లక్షల రూపాయల విలువచేసే 200 హెల్మెట్లు సమకూర్చమన్నారు. 



8.2 లక్షల రూపాయల విలువచేసే రెండు డ్రోన్లను కూడా కోర్టు సంస్థ అందించింది అన్నారు. సిబ్బంది తక్షణమే స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 64 ద్విచక్ర వాహనాలను కేటాయించగా, వాటిలో 44 ట్రాఫిక్ సిబ్బందికి, 20 శాంతి భద్రతల విభాగానికి అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్ట్, ఎల్పీజీ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.