అభివృద్ధి పేరుతో అడవుల నుండి ఆదివాసీలను, భూముల నుండి రైతులను, గెంటివేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి -రైతు కూలీ సంఘం పిలుపు
విజయవాడ: అభివృద్ధి పేరుతో అడవుల నుండి ఆదివాసీలను, భూముల నుండి రైతు, కూలీలను గెంటివేతను వ్యతిరేకించండని రైతు కూలీ సంఘం(ఏపి) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలపై కొనసాగుతున్న ప్రభుత్వం నిర్బంధకాండని ఖండించింది. ఈ మేరకు ఆదివారం నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ ఈనెల 26న జరిగే దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలను, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాల అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పంటలకు మద్దతు ధర చట్టబద్ధత చేయాలని, రుణమాఫీ చేయాలని, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లు 20 20 ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేబర్ కొడ్స్ రద్దు చేయాలని, జారీ చేసిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదుల పాదాక్రాంతం చేసే విత్తన చట్టం ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని కోరారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఛతీష్ గడ్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసి ప్రజలపై అక్రమ అరెస్టులు, అణిచివేత, నిర్బంధం, బూటకు ఎన్కౌంటర్లను తక్షణమే నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టుకోడానికి అవకాశం ఉన్న పట్టుకుని ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్యలు చేయడాన్ని ఖండించారు. అమాయక ఆదివాసీలపై అక్రమ కేసులని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆదివాసి గ్రామాలను 5వ ,6వ షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని, 1/70 చట్టం వర్తింపు చేయకుండా, వివిధ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసి భూములను ప్రభుత్వం ఎందుకు గుంజుకుంటుందని, వారిని భూనిర్వాసితులను చేస్తుందని మండిపడ్డారు. మన్యం జిల్లా దుగ్గేరు ప్రాంతంలో 2000 మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రోపవర్ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, వేలాది ఎకరాల సేకరణకు సిద్ధమవుతుందని వివరించారు. ప్రాజెక్టుకు అవసరమైన జల వనరులను ఆడారిగెడ్డ నుండే గాక, తోటపల్లి, వెంగళరాయసాగర్ రిజర్వాయర్లు నుండి కూడా నీళ్లు తీసుకుంటున్నారని తెలిపారు. రైతాంగాన్ని ఎండగట్టి, బడా కార్పొరేట్ కంపెనీలకు భూములు పరిహారం ఇవ్వటాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం, అల్లూరి జిల్లాల్లో హైడ్రో పవర్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల నిర్మాణానికి, పంటల పండే రైతులు భూములు ప్రభుత్వం కాజేసి ప్రాజెక్టులకు కట్టబెట్టడాన్ని సరైన విధానం కాదని ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. విద్యుత్ ఉత్పత్తి రైతాంగ ప్రయోజనాల కోసం కాకుండా, విశాఖలోని బడా కార్పొరేట్ కంపెనీలకు, గూగుల్ డేటా సెంటర్ భారీ విద్యుత్ అవసరాల కోసం, భారీ కార్పొరేట్ల లాభాల కోసం ప్రజాజీవనాడులని ఛిద్రం చేస్తూ, వేలాది ఎకరాల భూములు సేకరణకు పూనుకోవటాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు కూలి సంఘం(ఏపి) భూ నిర్వాసిత రైతులుకి అండగా నిలబడి ఆదివాసి, గిరిజనుల పక్షాన ఉద్యమాల నిర్మాణం చేస్తుందని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యు వీరబాబు, కె మోహన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
