నూతన ఆవిష్కరణతో లోకోమోటివ్‌లు మరింత ఆకర్షణీయంగా, సౌందర్యభరితం
తూర్పు కోస్తా రైల్వేకు చెందిన వాల్టేర్ డివిజన్ వినూత్న నాన్-ఫేర్ రెవెన్యూ దిశగా మరో వినూత్నమైన ముందడుగు వేసింది. ఈ క్రమంలో, పది (10) WAP-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లపై వాణిజ్య ప్రకటనల హక్కులను ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కేటరింగ్ & హాస్పిటాలిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్‌కు ఈ-ఆక్షన్ ప్రక్రియ ద్వారా మూడేళ్ల కాలానికి (2028 వరకు) విజయవంతంగా కేటాయించింది. ఈ చర్యతో, లోకోమోటివ్‌లు కంపెనీ ఆమోదించిన ఆకర్షణీయమైన డిజైన్లతో అలంకరించబడతాయి. ఫలితంగా అవి మరింత రంగురంగులుగా, ఆకర్షణీయంగా, సౌందర్యభరితంగా ప్రజల దృష్టిని ఆకట్టుకునేలా మారనున్నాయి.
అనుమతించిన డ్రాయింగ్‌ల ప్రకారం ప్రతి లోకోమోటివ్‌పై సుమారు 38.56 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని వాణిజ్య ప్రకటనల కోసం కేటాయించారు. ఈ ఒప్పందం ద్వారా సంవత్సరానికి రూ.7 లక్షలకుపైగా లైసెన్సింగ్ ఫీజు లభించనుండగా, మొత్తం ఒప్పంద విలువ రూ.26 లక్షలకు మించి ఉంటుంది. ఇది డివిజన్ నాన్-ఫేర్ రెవెన్యూ ఆదాయాలకు గణనీయమైన తోడ్పాటును అందిస్తుంది. ఈ సందర్భంలో కమర్షియల్ విభాగం బృందాన్ని అభినందించిన వాల్టేర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా మాట్లాడుతూ, రైల్వే ఆస్తులను వినూత్నంగా వినియోగించుకుంటూ, కార్యకలాపాలలో ఉన్నత ప్రమాణాలు మరియు భద్రతా ప్రమాణాలను కాపాడటం వాల్టేర్ డివిజన్ లక్ష్యమని అన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించే రోలింగ్ స్టాక్ ఆస్తులను వినూతన ప్రకటన వేదికలుగా మార్చడం ద్వారా డివిజన్ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ, భారతీయ రైల్వే యొక్క నాన్-ఫేర్ రెవెన్యూ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

