హిందూపురం, ఏప్రిల్ 10: స్థానిక పట్టణానికి చెందిన ప్రముఖ మల్లయోధుడు, వరుసగా 21 కుస్తీ పోటీల్లో అప్రతిహత విజయాలు సాధించిన పహిల్వాన్ రఫీఖ్ ఖురైషీని ప్రతిష్టాత్మక 'గ్రేట్ గామా (గులాం ముహమ్మద్ బక్ష్ భట్) పురస్కారం-2026' వరించింది. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ పురస్కార ప్రదానోత్సవం, జామియా మసీదు ముతవల్లీ అస్లాం అధ్యక్షతన ప్రజా సంఘాల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మరియు లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా రఫీఖ్ ఖురైషీ ఈ అవార్డును అందుకున్నారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. రఫీఖ్ ఖురైషీ హిందూపురంలో 13, ములబాగల్‌లో 2, కోలార్‌లో 2, పెనుగొండలో 4 చొప్పున మొత్తం 21 కుస్తీ పోటీల్లో విజేతగా నిలిచి అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, దేశీయ క్రీడలైన కుస్తీ, కరాటే, రెజ్లింగ్ వంటి కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం పట్టణ అల్ ఖురైష్ యూనియన్ ప్రతినిధులు జబీవుల్లా, ఫారూఖ్ మరియు స్థానిక యువత రఫీఖ్ ఖురైషీని పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు శ్రీరాములు, బహుజన నాయకుడు హరి, శివ కరాటే మాస్టర్ ఫైరోజ్, రెజ్లింగ్ కోచ్ ఉసామా ఖాన్, ఐజా జిమ్ ట్రైనర్ ఇమ్రాన్, పహిల్వాన్లు సాదిక్, హనీఫ్, ఫయాజ్, సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.


