ప్రధాని మోదీ చేతుల మీదుగా నియామక పత్రాలు
19వ జాతీయ రోజ్‌గార్ మేళా ఘనంగా
విశాఖలో 190 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు
యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో కేంద్రం ముందంజ
వికసిత్ భారత్ లక్ష్యంగా యువతకు ప్రధాని పిలుపు
దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో నిర్వహించిన 19వ జాతీయ రోజ్‌గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51 వేలకుపైగా నియామక పత్రాలు పంపిణీ... విశాఖ ఐఐఎంలో జరిగిన కార్యక్రమంలో 190 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేత... ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాలని యువతకు ప్రధాని సూచన...
దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “జాతీయ రోజ్‌గార్ మేళా” 19వ విడత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఎంపికైన 51 వేలకుపైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ “నాగరిక్ దేవో భవ” అనే మంత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల సేవను ధర్మంగా భావించాలని సూచించారు. “నాగరిక్ కల్యాణ్” ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. యువత నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని భారతీయ రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) విశాఖపట్నంలో నిర్వహించారు. వాల్తేర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ఎం. చంద్రశేఖర్, ఎస్.ఎస్. శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే, విద్యాశాఖ, పోస్టల్ శాఖ, ఇండియన్ నేవీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 190 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన లలిత్ బోహ్రా నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, నిజాయితీతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి కల్పన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళా ద్వారా ఇప్పటివరకు దాదాపు 12 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. దేశ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం కీలకంగా మారిందన్నారు.
#RozgarMela #PMModi #NarendraModi #Visakhapatnam #IIMVizag #EmploymentNews #GovtJobs #YouthEmpowerment #ViksitBharat #B2BNews #AndhraPradeshNews

