బండి భగీరథ్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారంలో హైదరాబాద్ సివిల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విషయంలో బండి సంజయ్ పేరును గానీ, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే ఎటువంటి అంశాలను గానీ ప్రసారం చేయకూడదని అన్ని డిజిటల్, శాటిలైట్ మీడియా ఛానెళ్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ను కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ గ్యాగ్ ఆర్డర్ జారీ అయింది.



న్యాయస్థానం కేవలం భవిష్యత్తులో వచ్చే వార్తలపైనే కాకుండా, ఇప్పటికే ప్రచురితమైన అంశాలపై కూడా కఠినంగా వ్యవహరించింది. సోషల్ మీడియాలో, వివిధ మీడియాల్లో బండి సంజయ్ , ఆయన కుమారుడికి సంబంధించి ఇప్పటివరకు పోస్ట్ చేసిన, ప్రసారం చేసిన అభ్యంతరకరమైన, నిందించే కంటెంట్ మొత్తాన్ని తక్షణమే తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. మీడియా ట్రయల్స్ ద్వారా న్యాయ ప్రక్రియ ప్రభావితం కాకూడదనే ఉద్దేశంతో ఈ బ్లాంకెట్ ఇంజంక్షన్ ఉత్తర్వులను కోర్టు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఉత్తర్వుల్లో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. బండి భగీరథ్ కేసు ప్రస్తావన వచ్చినప్పుడు ఎక్కడా బండి సంజయ్ పేరును ఏ రూపంలోనూ వాడకూడదని కోర్టు స్పష్టంగా పేర్కొంది. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా ఉండాలని, సంచలనాత్మక వార్తల ద్వారా విచారణను పక్కదారి పట్టించవద్దని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని సామాజిక మాధ్యమాలు, వార్తా సంస్థలు ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

న్యాయస్థానం జారీ చేసిన ఈ గ్యాగ్ ఆర్డర్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ వార్తలు ప్రసారం చేసినా లేదా పోస్టులు షేర్ చేసినా కోర్టు ధిక్కార కింద కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.