విశాఖ ప్రమాద బాధితులను పరామర్శించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విశాఖపట్నం, మే 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, గాయపడిన క్షతగాత్రులను ఈరోజు కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో పరామర్శించారు.



ఈ సందర్భంగా ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు సత్వర సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.



మంత్రి వెంట స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ ఎస్. దున్నదొర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి విజయగీత, రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు, కేజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, ఆర్డీవో, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విశాఖ జిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ, ట్రాఫిక్ మరియు సంబంధిత విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రోడ్డుపై నిలిచిపోయిన టిప్పర్ వాహనాన్ని రాజమండ్రి నుండి పార్వతీపురం వెళ్తున్న పార్వతీపురం డిపోకు చెందిన ఏపీ-35-Z-173 నంబర్ ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున సుమారు 4.15 గంటల సమయంలో గాజువాక నియోజకవర్గ పరిధిలోని శ్రీనగర్ ప్రాంతంలో వెనుక నుంచి ఢీకొన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు సమగ్ర విచారణ నిర్వహించాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.