దక్షిణ కోస్తా రైల్వే ఆధ్వర్యంలో నిర్వహణ – “ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా”పై అవగాహన
విశాఖపట్నం, జూన్ 21: దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీసీఆర్) ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. జోన్ పరిధిలోని వివిధ శాఖలు, యూనిట్లకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ (ఎస్‌సీఓఆర్‌డబ్ల్యూవో) అధ్యక్షురాలు చారు మాథుర్ నాయకత్వం వహించారు. ప్రధాన శాఖాధిపతులు, అధికారులు, ఎస్‌సీఓఆర్‌డబ్ల్యూవో సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేడెట్లు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సందీప్ మాథుర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 2014లో ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి యోగా ప్రపంచవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సును పెంపొందించే ఉద్యమంగా మారిందన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానాంశం “ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా” (Yoga for Healthy Ageing) అని పేర్కొన్న ఆయన, యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును అందించే జీవన విధానమని వివరించారు. దేశసేవలో నిరంతరం విధులు నిర్వర్తించే రైల్వే ఉద్యోగులకు యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు భావోద్వేగ స్థైర్యాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. గత సంవత్సరం విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం దేశానికి గర్వకారణమని ఆయన గుర్తుచేశారు. యోగా, సమగ్ర ఆరోగ్య రంగాల్లో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.
ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించిన జనరల్ మేనేజర్, కార్యాలయ సమయంలో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు రూపొందించిన “5 నిమిషాల వై-బ్రేక్ (Y-Break) ప్రోటోకాల్”ను పాటించాలని పిలుపునిచ్చారు. “ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా” సందేశాన్ని సమాజంలోని ప్రతి వర్గానికి చేర్చాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. యోగా సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సహకరించిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. యోగాను జీవన విధానంగా స్వీకరించి ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలనే ప్రతిజ్ఞతో కార్యక్రమం ముగిసింది.
– వై. బాలాజీ కిరణ్
ముఖ్య ప్రజాసంబంధాల అధికారి
దక్షిణ కోస్తా రైల్వే, విశాఖపట్నం





