విశాఖపట్నం, జూలై 1: దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని బుధవారం (జూలై 1) డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో ఘనంగా నిర్వహించారు. భారత వైద్య రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం వారు అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను అభినందించారు. నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, భారతీయ రైల్వే ఆరోగ్య సేవల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో వారి కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ప్రధాన వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ డి. శరత్ బాబు ఆధ్వర్యంలో డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో సీనియర్ రైల్వే అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డీఆర్‌ఎం రెండు అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. వీటిలో OPTIK Surgical Operating ENT Microscope మరియు Ano-Proctology, Varicose Veins చికిత్స కోసం Advanced Diode Laser System ఉన్నాయి. ఈ అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు ద్వారా ఆస్పత్రిలో నిర్ధారణ (డయాగ్నస్టిక్) మరియు శస్త్రచికిత్స సేవలు మరింత మెరుగుపడనున్నాయి. అత్యల్ప గాయాలతో (Minimally Invasive) అధునాతన చికిత్సలను మరింత కచ్చితత్వంతో అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని, దీంతో రోగులకు మెరుగైన వైద్య ఫలితాలు అందనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.


