నెలలోపే తాగునీటి సమస్య పరిష్కారం.. కూటమి ప్రభుత్వం, అధికారులకు గ్రామస్తుల కృతజ్ఞతలు
గూడెం, (అల్లూరి సీతారామరాజు జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దామనపల్లి పంచాయతీ పరిధిలోని సిగినపల్లి రామ్‌నగర్ కాలనీలో దశాబ్దకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. స్పందన కార్యక్రమంలో బీజేపీ నాయకుడు దుక్కేరి ప్రభాకరరావు సమర్పించిన వినతిపత్రంపై జిల్లా అధికారులు వేగంగా స్పందించి, నెల రోజుల్లోనే బోరు తవ్వించి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడు సంకోజీ మూగయ్య జన్మించిన ఈ కాలనీలో సుమారు 15 కుటుంబాలకు చెందిన 50 మందికి పైగా ప్రజలు ఎన్నో ఏళ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి కాలువ నీటిని తెచ్చుకుని వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల తరఫున బీజేపీ నాయకుడు దుక్కేరి ప్రభాకరరావు స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. దానిపై స్పందించిన జిల్లా యంత్రాంగం కూటమి ప్రభుత్వ నిధులతో బోరు ఏర్పాటు చేసి, ఇంటింటికీ తాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు కూటమి ప్రభుత్వం మరియు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమస్య పరిష్కారానికి కృషి చేసిన బీజేపీ నాయకుడు దుక్కేరి ప్రభాకరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో సంకోజీ చంటిబాబు, పాంగి రంగారావు, దుక్కేరి బాబురావు, సంకోజీ సింహాచలం, సంకోజీ రామారావు, సంకోజీ మహేష్, కిముడు కృష్ణ, గ్రామ మహిళలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

