భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ సిద్ధం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ సిద్ధం

ఏపీఎస్ఆర్టీసీ ఆర్‌ఎం బి. అప్పల నాయుడు తనిఖీ

భోగాపురం, జూలై 14: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరలో రానున్న ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్‌ను విశాఖపట్నం రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) శ్రీ బి. అప్పల నాయుడు తన బృందంతో కలిసి సోమవారం పరిశీలించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏర్పాటు చేసిన మూడు హై-స్పీడ్ ఛార్జింగ్ యూనిట్లు, బస్సులు నిలిపే ప్లాట్‌ఫారాలు, సిబ్బంది విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ గదులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బస్సులు అందుబాటులోకి వచ్చిన వెంటనే భోగాపురం విమానాశ్రయంలోనే ఛార్జింగ్ సదుపాయం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెలలో జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రారంభోత్సవానికి వీలైనంత వరకు 20 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ఏ. గంగాధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అచ్చం నాయుడు, సూపర్వైజర్లు, పినాకిల్ సంస్థ ఇంజనీర్లు, భోగాపురం విమానాశ్రయ ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు ఇతర మౌలిక వసతులను పరిశీలించి, అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.