కౌతాళం, ఆగస్టు 12 (వార్త ప్రతినిధి): కౌతాళం–బళ్లారి, బళ్లారి–కౌతాళం మధ్య ఆదోని మీదుగా నూతన బస్సు సర్వీసును ఆశా ట్రావెల్స్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. శ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామి ధర్మకర్త శ్రీ సయ్యద్ మున్నా పాషా చిస్తి చేతుల మీదుగా బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సర్వీస్‌కు సయ్యద్ యూన్యూస్ పాషా ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా సయ్యద్ యూన్యూస్ పాషా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం నుంచి కౌతాళం శ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామి దర్గాను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో పాటు సాధారణ ప్రయాణికులకు ఈ బస్సు సర్వీస్ ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు బళ్లారి నుంచి బయలుదేరే బస్సు ఉదయం 11 గంటలకు కౌతాళం చేరుకుంటుందని, అనంతరం సాయంత్రం 4 గంటలకు కౌతాళం నుంచి బళ్లారికి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు.
ప్రయాణికుల ఆదరణ, అవసరాలను బట్టి భవిష్యత్తులో బస్సు సమయాల్లో మార్పులు, చేర్పులు చేపడతామని పేర్కొన్నారు. అలాగే త్వరలో కౌతాళం–బెంగళూరు మధ్య కూడా నూతన బస్సు సర్వీసును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రతిభ హైస్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ దూద్ భాషా, సమద్, టైలర్ వలి సాబ్, స్థానిక ప్రముఖులు, భక్తులు, ప్రయాణికులు పాల్గొన్నారు.

