ముందుగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి: గుడిసె ఆది కృష్ణమ్మ

పరామర్శల పేరుతో రాజకీయాలు మానాలి.. ముందుగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి: గుడిసె ఆది కృష్ణమ్మ



ఆదోని, ఆగస్టు 12: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం కంటే, ముందుగా ఆలూరు నియోజకవర్గంలో దాడికి గురైన దళిత కుటుంబంతో పాటు యాదవ, వాల్మీకి బోయ వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ డిమాండ్ చేశారు.



బుధవారం ఆదోనిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆమె, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు పరామర్శల పేరుతో రాజకీయ డ్రామాలు ఆడటం తగదని విమర్శించారు. ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే, ముందుగా తన పార్టీ నాయకులు, కార్యకర్తల చేతిలో దాడులకు గురైన బాధిత కుటుంబాలను కలిసి వారికి అండగా నిలవాలని సూచించారు. ఆలూరు నియోజకవర్గంలో దళిత కుటుంబంపై జరిగిన దాడి ఘటనలో బాధితుల పక్షాన నిలవాల్సిన వైఎస్ జగన్, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయకుండా వారిని సమర్థించడం బాధాకరమని ఆది కృష్ణమ్మ అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పర్యటనలు చేయకుండా, నిజంగా బాధితులైన దళితులు, యాదవులు, వాల్మీకి బోయ కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని ఆమె సూచించారు. బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు, ముఖ్యంగా దళిత, బీసీ వర్గాల ప్రజలు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పర్యటనలు చేస్తే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని ఆది కృష్ణమ్మ హెచ్చరించారు. ముందుగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం జరిగేలా చొరవ చూపిన తర్వాతే రాజకీయ విమర్శలు చేయాలని వైఎస్ జగన్‌కు గుడిసె ఆది కృష్ణమ్మ హితవు పలికారు.