ప్రెసిడెన్షియల్' ఆర్డర్ పై పునరాలోచించాలి
ఎమ్మెల్యేలకు ఉద్యోగుల విజ్ఞప్తులు
ఏపీ సీఎస్ తో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులకూ లేఖలు
విశాఖపట్నం, ఆగస్టు 7: ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల నుంచి తమను మినహాయించాలంటూ జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు అందరికీ ఉన్నవించుకుంటూ వస్తున్నారు. చట్టంలోని సెక్షన్లు చూపిస్తూ ఉన్నతాధికారులకు లేఖలు కుడా రాశారు. తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేయాలంటూ తాజాగా శుక్రవారం ఎమ్మెల్యేల్ని ఆశ్రయించారు. మాజీ మంత్రివర్యులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తమకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు పలువురు ఉద్యోగ సంఘ నేతలతో పాటు బాధితులు ఒక ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీలోని మినిస్టీరియల్ ఉద్యోగులకు సంబంధించి అందర్నీ ఒకే యూనిట్‌గా కొనసాగించడంతో పాటు నియామక అధికారిగా కమిషనర్ నే యథాతథంగా ఉంచాలంటూ విజ్ఞప్తి చేశారు. జీవో 135పై పునఃపరిశీలించాలని కోరుతున్నారు.
జీవీఎంసీ అనేది ప్రత్యేకంగా రూపొందించబడిన 'విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1979' నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని గుర్తు చేశారు. మినిస్టీరియల్ విభాగం ఒకే యూనిట్‌గా పని చేస్తోందని, తదనుగుణంగా ప్రత్యేక సర్వీసు నిబంధనలు రూపొందించబడ్డాయని గుర్తు చేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సర్వీసు ప్రొవిన్షియలైజేషన్ (రాష్ట్ర స్థాయి సర్వీసులో విలీనం) ప్రక్రియ చేపట్టలేదని, స్థానిక సంస్థలకు చట్టబద్ధమైన గ్రాంట్లు విడుదల చేయడానికి బదులు ప్రభుత్వం ద్వారానే జీతాలు చెల్లించబడుతున్నాయన్నారు. వీరి సర్వీసు షరతులు 'విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1979' దాని కింద రూపొందించబడిన ప్రత్యేక సర్వీసు నిబంధనల ద్వారానే నిర్వహించబడుతున్నాయన్నారు.
వీటిలో వీరిని రాష్ట్ర స్థాయి సర్వీసుగా కాకుండా ఒకే యూనిట్‌గా పరిగణించడం జరుగుతోందన్నారు. ఇలా మొత్తం ఆ చట్టంలోని ముఖ్యమైన 9అంశాల్ని ఎమ్మెల్యేల ద్రుష్టికి ఉద్యోగులు తీసుకు వెళ్లారు.
ఇదంతా ఒకే యూనిట్: అన్ని కేటగిరీల మినిస్టీరియల్ ఉద్యోగుల కోసం జీవీఎంసీని ఒకే యూనిట్‌గా కొనసాగించాలని ఉద్యోగులు కోరారు. చట్టం ప్రకారం జీవీఎంసీ కమిషనర్‌ను నియామక అధికారిగా నియమించాలని, ప్రస్తుత వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇలా మొత్తం 4 ముఖ్యమైన అంశాల్ని శాసన సభ్యుల దృష్టికి తీసుకు వెళ్లారు.
ఎమ్మెల్యేలను కలిసిన వారిలో విఎంసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వివి వామన్ రావు, గుమ్మడి నర్సింగ్, జీవీఎంసీ ఏఐటీయూసీ అధ్యక్షులు పడాల రమణ, కార్యదర్శి ప్రియదర్శిని, ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు, కోశాధికారి రవి, జివిఎంసి మినిస్టీరియల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ.అప్పలనాయుడు, సన్నీ, క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గణపతి, జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనుబాబు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.





