ఒకే యూనిట్..ఒకరే కమిషనర్!

ఊపందుకున్న మినిస్టీరియల్ ఉద్యోగుల పోరాటం

‘ప్రెసిడెన్షియల’ ఆర్డర్‌పై పునరాలోచించాలంటూ నేతల్ని ఆశ్రయిస్తున్న బాధితులు* 



విశాఖపట్నం, ఆగస్టు 8: ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల నుంచి తమను మినహాయించాలంటూ జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమం ఊపందుకుంది. జీవీఎంసీ ఏర్పడిన చట్టంలోని సెక్షన్లను చూపిస్తూ ఉన్నతాధికారులకు ఇప్పటికే లేఖలు కుడా రాశారు. తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలంటూ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. శనివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఆశ్రయించారు. బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజును కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. విశాఖ జనసేన నగరాధ్యక్షులు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసి జీవీఎంసీలోని మినిస్టీరియల్ ఉద్యోగులకు సంబంధించి అందర్నీ ఒకే యూనిట్‌గా కొనసాగించడంతో పాటు నియామక అధికారిగా కమిషనర్‌నే యధావిధిగా ఉంచాలంటూ విజ్ఞప్తి చేశారు. జీవో 135పై పునఃపరిశీలించాలని కోరారు. ‘విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1979’ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని గుర్తు చేశారు. మినిస్టీరియల్ విభాగం ఒకే యూనిట్‌గా పని చేస్తోందని, తదనుగుణంగా ప్రత్యేక సర్వీసు నిబంధనలు రూపొందించబడ్డాయని గుర్తు చేశారు. 



ఇప్పటి వరకు జీవీఎంసీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సర్వీసు ప్రొవిన్షియలైజేషన్ (రాష్ట్ర స్థాయి సర్వీసులో విలీనం) ప్రక్రియ చేపట్టలేదని, స్థానిక సంస్థలకు చట్టబద్ధమైన గ్రాంట్లు విడుదల చేయడానికి బదులు ప్రభుత్వం ద్వారానే జీతాలు చెల్లించబడుతున్నాయన్నారు. వీరి సర్వీసు షరతులు కూడా ‘విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1979’ దాని కింద రూపొందించబడిన ప్రత్యేక సర్వీసు నిబంధనల ద్వారానే నిర్వహించబడుతున్నాయన్నారు. వీటిలో వీరిని రాష్ట్ర స్థాయి సర్వీసుగా కాకుండా ఒకే యూనిట్‌గా పరిగణించడం జరుగుతోందన్నారు. ఇలా మొత్తం ఆ చట్టంలోని ముఖ్యమైన 9అంశాల్ని ఎమ్మెల్యేల ద్రుష్టికి ఉద్యోగులు తీసుకు వెళ్లారు. 



ఎమ్మెల్యేల్ని కలిసిన వారిలో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వీవీ వామనరావు, గుమ్మడి నర్సింగ్, జీవీఎంసీ ఏఐటీయూసీ అధ్యక్షులు పడాల రమణ, బొట్ట ఎర్రాజీ, ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు, కోశాధికారి రవి, జీవీఎంసీ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ.అప్పలనాయుడు, సన్నీ, క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గణపతి, జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనుబాబు, వి. శ్రీనివాసరావు, రాజేష్ తో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.