బనగానపల్లెలో ఘనంగా AISF 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు



బనగానపల్లె, ఆగస్టు 12: స్థానిక సీపీఐ కార్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి AISF మండల అధ్యక్షుడు మాథష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా AISF మాజీ నాయకుడు బాలకృష్ణ, AISF నంద్యాల జిల్లా అధ్యక్షుడు పి. ఎర్రిస్వామి పాల్గొన్నారు.



ఈ సందర్భంగా బాలకృష్ణ, ఎర్రిస్వామి సంయుక్తంగా AISF అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల నినాదాల మధ్య ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, 1936 ఆగస్టు 12న లక్నోలో ఆవిర్భవించిన AISF భారతదేశంలో ఏర్పడిన తొలి జాతీయ విద్యార్థి సంఘమని గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కుల సాధన, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం AISF నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. “చదువు – పోరాటం” అనే నినాదంతో లక్షలాది మంది విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యాపారీకరణ వేగంగా పెరుగుతోందని, దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అందరికీ సమానమైన, ఉచిత, శాస్త్రీయ విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజుల నియంత్రణ, హాస్టల్ వసతుల మెరుగుదల, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడం వంటి విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం AISF ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నేటి తరం విద్యార్థులు AISF చారిత్రక స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విద్యా హక్కుల పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బనగానపల్లె మండల కార్యదర్శి శివయ్య, సీపీఐ సీనియర్ నాయకులు సంజీవులు, AISF మాజీ అధ్యక్షుడు రామస్వామి, మండల సహాయ కార్యదర్శి మనోజ్, నాయకులు మహి, మధు, వినయ్, సురేష్, సురేంద్ర, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.