విద్యా కాషాయీకరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలి...
కౌతాళంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ...
కౌతాళం, ఆగస్టు 12: విద్యా కాషాయీకరణకు, విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం కౌతాళం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు గురు, బసవరాజ్, కే. మంజునాథ్ సంస్థ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ, 1936 ఆగస్టు 12న లక్నోలో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ దేశంలో ఏర్పడిన తొలి జాతీయ విద్యార్థి సంఘమని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యాభివృద్ధి కోసం సంఘం నిరంతరం పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. "చదువు – పోరాటం" అనే నినాదంతో కోట్లాది మంది విద్యార్థుల్లో సామాజిక చైతన్యం కల్పించిన ఘనత ఏఐఎస్ఎఫ్‌కే దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం విద్యా రంగంలో వ్యాపారీకరణ పెరుగుతోందని, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు విద్యా రంగాన్ని బలోపేతం చేసి అందరికీ సమానమైన, ఉచిత, శాస్త్రీయ విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫీజుల నియంత్రణ, హాస్టల్ వసతుల మెరుగుదల, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడం వంటి విద్యార్థి సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. నేటి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ చారిత్రక స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యా హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు హనుమేష్, మండల నాయకులు నవీన్, నరసింహ, ప్రవీణ్, మల్లి తదితరులు పాల్గొన్నారు.

