ఆదోనికి 6 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు

 


ఆదోని: తల్లులు, నవజాత శిశువులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఆదోని నియోజకవర్గానికి 6 నూతన 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఉదయం స్థానిక MCH ఆసుపత్రిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకి నూతన వాహనాలను ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆదోని MCH ఆసుపత్రిలో అధిక సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. నూతన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల అందుబాటులోకి రావడంతో ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులకు మరింత మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు.



రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనాలను అర్హులైన తల్లులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.



కార్యక్రమంలో MCH ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మధుసూదన్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీమతి లలితమ్మ, శ్రీ రేణు వర్మ, బీజేపీ నాయకులు ఉపేంద్ర కుమార్, మధుసూదన్ శర్మ, ప్రశాంత్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.