బోరు సౌకర్యంతో మౌలిక వసతులు కల్పించాలి: సీపీఐ డిమాండ్
ఆదోని, ఆగస్టు 11: దొడ్డనగేరి గ్రామ సమీపంలోని స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు బోరు సౌకర్యం కల్పించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీపీఐ ఆదోని మండల సమితి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేసింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని సీపీఐ నాయకులు విమర్శించారు.
సీపీఐ జాతీయ పిలుపులో భాగంగా మండల కార్యదర్శి బావిరాజు నాయకత్వంలో దొడ్డనగేరి, కొత్తూరు గ్రామాల్లో ప్రచార పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను పరిశీలించి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నూతన పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటి స్థలం లేని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మూడు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రైతులు సాగు చేసిన అన్ని రకాల పంటలకు ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం అందించాలని, పంట రుణాల కింద తీసుకున్న బ్యాంకు రుణాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కొత్తూరు గ్రామానికి ప్రత్యేకంగా నూతన సచివాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో డ్రైనేజీలను ముందస్తుగా శుభ్రం చేసి అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, దొడ్డనగేరి గ్రామ శాఖ కార్యదర్శి ఉరుకుందు, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఓబి నాగరాజు, ఏఐటీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైటీ భీమేష్, కోశాధికారి వెంకన్న, జిల్లా సమితి సభ్యులు షేక్ షావలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొత్తూరు గంగన్న, సీపీఐ మాజీ సర్పంచ్ హనుమంతు, నాయకులు రంగన్న, ముని, శంకరయ్య, తలారి రాజు, మహానంది రామన్న తదితరులు పాల్గొన్నారు.

