కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

 ఎకరాకు ₹50 వేల నష్టపరిహారం ఇవ్వాలి: రైతు సంఘం (ఏఐకేఎస్) డిమాండ్

  104 బసాపురం సచివాలయం ఎదుట రైతులు, కార్మికుల ధర్నా



ఆదోని, సెప్టెంబర్ 24: కర్నూలు జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (ఏఐకేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆదోని మండలం 104 బసాపురం గ్రామ సచివాలయం ఎదుట ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.



ఈ సందర్భంగా రైతు సంఘం ఆదోని నియోజకవర్గ కార్యదర్శి బసాపురం గోపాల్, గౌరవ అధ్యక్షులు లక్ష్మీ రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ మాట్లాడుతూ.. వర్షాలు లేక పెట్టుబడులు పెట్టిన పంటలన్నీ ఎండిపోవడంతో రైతులు తీవ్ర అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కరువు పరిస్థితులను అంచనా వేసి రైతులు, కౌలు రైతులు, కూలీలను ఆదుకోవాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు:

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ₹50 వేల పరిహారం చెల్లించాలి.

బ్యాంక్ పంట రుణాలను రూ. 2 లక్షల వరకు మాఫీ చేయాలి.

పశువులకు ఉచితంగా పశుగ్రాసం, రైతులకు ఉచిత విత్తనాలు అందించాలి.

ప్రతి కుటుంబానికి ₹20 వేల కరువు సహాయక పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ పరిహారాన్ని వెంటనే జమ చేయాలి.

ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలిని ₹700కు పెంచాలి.

రేషన్ దుకాణాల్లో 15 రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేయాలి, తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలి.

సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి కె. రమేష్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి కె. లింగప్ప, డిహెచ్‌పీఎస్ నియోజకవర్గ కార్యదర్శి ఎ. విజయ్ కుమార్, డిహెచ్‌పీఎస్ నాయకులు తిరుమల, పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.