ఘనంగా జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవాలు

శరీర ఎదుగుదలకు ‘అయోడిన్’ తప్పనిసరి: డీఎంహెచ్‌ఓ డా. పి. జగదీశ్వర రావు

 ఘనంగా జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవాలు

 పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించిన అధికారులు



విశాఖపట్నం : శరీర ఎదుగుదలకు, ముఖ్యంగా చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి అయోడిన్ అత్యంత కీలకమైన సూక్ష్మ పోషకమని విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ పి. జగదీశ్వర రావు స్పష్టం చేశారు. జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులతో కలిసి ప్రత్యేక అవగాహన గోడ పత్రికలు, బ్యానర్లను ఆయన ఆవిష్కరించారు.



ఈ సందర్భంగా డా. జగదీశ్వర రావు మాట్లాడుతూ, అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అయోడిన్ లోపంపై ప్రత్యేక అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆహారంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి వాచిపోయి ‘గాయిటర్’ (గొంతు వాపు) వస్తుందని తెలిపారు. గర్భిణులలో ఈ లోపం ఉంటే గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం కావడం, మృత శిశు జననాలు జరగడం లేదా పుట్టే పిల్లల్లో లోపాలు ఏర్పడటం జరుగుతుందన్నారు. అలాగే చిన్నారులలో మరగుజ్జుతనం, బుద్ధిమాంద్యం, మూగ, చెవుడు వంటి శాశ్వత వైకల్యాలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కేవలం నాణ్యమైన అయోడైజ్డ్ ఉప్పునే ఆహారంలో వినియోగించాలని, దాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), అర్బన్ హెల్త్ సెంటర్ల (UPHCs) వైద్యులు, సిబ్బంది గర్భిణులు, బాలింతలు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విద్యార్థులకు క్విజ్ పోటీలు: 

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ హైస్కూల్ (మధురానగర్) నందు ఆర్బీఎస్కే సమన్వయకర్త డాక్టర్ బి. హారిక, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అయోడిన్ ప్రాముఖ్యతపై క్విజ్ పోటీలు నిర్వహించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డీపీఎంఓ (ఎన్‌హెచ్‌ఎం) డా. బి. ఉమావతి, డెమో శ్రీ బి. నాగేశ్వర రావు, విమెన్ హెల్త్ ఆఫీసర్ డా. ఎన్.వి. సమత, డీపీహెచ్‌ఎన్‌ఓ శ్రీమతి ఎం. సత్యవతి, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి. నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.