అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

అమలాపురంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ

కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది: ఎస్పీ రాహుల్ మీనా



అమలాపురం, అక్టోబర్ 21: ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక పోలీస్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘన నివాళులర్పించారు.

కార్యక్రమంలో తొలుత పెరేడ్ కమాండర్ ఆర్‌ఐ ఎన్. బ్రహ్మానందం గౌరవ వందనం సమర్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన సంస్మరణ పుస్తకాన్ని కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా ఆవిష్కరించారు.



అమరుల త్యాగం స్ఫూర్తిదాయకం: కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్: 

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయమని కలెక్టర్ అన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలు రాబోయే తరాలకు, తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. నిరంతరం ప్రజాసేవలో శ్రమిస్తున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పిలుపునిచ్చారు.

కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం: ఎస్పీ రాహుల్ మీనా: 

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దళాలను ఎదుర్కొని అమరులైన జవాన్ల త్యాగానికి ప్రతీకగా ఏటా ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే, అంతర్గత భద్రతను కాపాడటంలో పోలీసులు ప్రాణాలర్పిస్తున్నారని గుర్తుచేశారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ నిరంతరం అండగా ఉంటుందని, ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ప్రతి పోలీసు అధికారి ప్రజలకు న్యాయం, నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించడమే అమరవీరులకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు సత్కారం: 

అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) మహేంద్ర మత్తే 'రోల్ ఆఫ్ హానర్' చదివి వినిపిస్తూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు అమరులయ్యారని తెలిపారు. అనంతరం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో పాటు, గత ఏడాది అమరులైన కుటుంబాలకు జ్ఞాపికలు, పండ్లు అందజేసి ఆత్మీయంగా మాట్లాడారు. 

ఈ కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, మహిళా పీఎస్ డీఎస్పీ షేక్ షాభాజ్ అహ్మద్, ఏఆర్ డీఎస్పీ జి.యు.కె.ఎల్.వి. సుబ్బరాజు, ఎస్బీ సీఐ పుల్లారావు, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.